Ivy Gourd : మనకు మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. చాలా మంది దొండకాయలను తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తప్పకుండా తింటారు. అయితే దొండకాయలను ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతోపాటు, దొండ ఆకులను కూడా తింటారు. కారణం ఇందులో ఉంటే విటమిన్లు, ఖనిజ లవణాలే. దొండకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే.. కనీసం వారంలో రెండుసార్లు దొండకాయలను తింటారు. దొండకాయలను తినడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరణ చేసి మాలిక్యులర్ స్థాయిలో కణాలకు నష్టం కలగకుండా కాపాడుతాయి. ఫైబర్, విటమిన్ బి, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గించడానికి సహాయపడుతాయి. ఇందులో పొటాషియం కూడా సమృద్ధిగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త ప్రవాహం బాగా జరిగి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
కొంతమంది దొండకాయలను పచ్చిగా కూడా తింటూ ఉంటారు. అలా కూడా తినవచ్చు. మన శరీరంలో ఎక్కువ పోషకాలు చేరతాయి. కాబట్టి దొండకాయను మీకు వీలైన పద్ధతిలో తీసుకుని దానిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. చాలామంది దొండకాయలను తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని తినడం మానేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. జ్ఞాపక శక్తి తగ్గటం అనేది ఉండదు కాబట్టి ఎటువంటి అపోహలు లేకుండా దొండకాయలను తినండి. దొండకాయలు సంవత్సరం పొడవునా లభిస్తాయి. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి దొండకాయలను తిని ఆరోగ్యంగా ఉండండి.