Jowar Soup : ప్రస్తుత కాలంలో చిరుధాన్యాల వాడకం పెరిగిందనే చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. జొన్నల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జొన్నలతో మనం ఎక్కువగా సంగటి, రొట్టె వంటి వాటిని మాత్రమే తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం జొన్న పిండితో ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. జొన్నపిండితో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జొన్నపిండితో రుచిగా, సులభంగా సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.
అలాగే ఈ సూప్ ను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జొన్నపిండిని సూప్ ను తయారు చేయడం చాలా తేలిక. దీని కోసం ఒక జార్ లో అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ లజొన్నపిండిని తీసుకుని అందులో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, కొద్దిగా క్యారెట్ తురుము, స్వీట్ కార్న్, గ్రీన్ బఠాణీ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. తరువాత జొన్నపిండి మిశ్రమం, ఉప్పు వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జొన్నపిండి సూప్ తయారవుతుంది.
దీనిని తీసుకోవడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జొన్నపిండి సూప్ ను రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికి కావల్సిన మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయి. ఈ సూప్ ను తాగడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ సూప్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ సూప్ ను తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా జొన్నపిండితో సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.