Gongura Meal Maker Curry : మన ఆరోగ్యానికి గోంగూర ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. గోంగూరతో మనం పప్పు, పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్ ఇలా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం గోంగూరతో గోంగూర మీల్ మేకర్ కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. 20 నిమిషాల్లో ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు. గోంగూరతో వెరైటీ వంటకాలు చేయాలనుకునే వారు ఇలా గోంగూర మీల్ మేకర్ కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో కమ్మగా ఉండే గోంగూర మీల్ మేకర్ కర్రీని క్యాటరింగ్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, గోంగూర – గుప్పెడు, పచ్చిమిర్చి – 4, నీళ్లు – ఒక టీ గ్లాస్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం -ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మీల్ మేకర్ ను తీసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు వేడి నీటిని పోసి మీల్ మేకర్ లను నానబెట్టాలి. మీల్ మేకర్ నానిన తరువాత నీళ్లని పోయేలా వాటిని చేత్తో పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో గోంగూర, పచ్చమిర్చి,నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. గోంగూర మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ గోంగూరను జార్ లో వేసిమెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మీల్ మేకర్ లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఉల్లిపాయ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు ఉడికించిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన మీల్ మేకర్, గరం మసాలా వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, జీరా రైస్, ప్లేన్ పులావ్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.