Juices For Cholesterol : నేటి తరుణంలో మనలో చాలా మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం , ఎక్కువ గంటలు కూర్చునిపని చేయడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపేతుంది. దీంతో రక్తసరఫరాకు అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తున్నాయి. ప్రాణాంతకంగా మారిన ఈ గుండె జబ్బుల బారిన మనం పడకుండా ఉండాలంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండాలంటే జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా ధూమపానం, మధ్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటితో పాటు కొన్ని రకాల జ్యూస్ లను తీసుకోవడం వల్ల కూడా మనం మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ జ్యూస్ లను తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే జ్యూస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మనకు దానిమ్మ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది.

ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేయడంలో కూడా దోహదపడుతుంది. దానిమ్మ జ్యూస్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే నూనెలో వేయించిన పదార్థాలను, జంక్ ఫుడ్ ను తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే నారింజ పండ్ల రసాన్ని తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ జ్యూస్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ ను తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే టమాట జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. టమాట పండ్లల్లో లైకోపిన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది లిపిడ్ల స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. టమాట జ్యూస్ ను తాగడం వల్ల గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉండాలనుకునే వారు రోజూ ఓట్ మీల్ ను తీసుకోవాలి. ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల ప్రేగులు మనం తినే ఆహారంలో ఉండే కొవ్వులను గ్రహించకుండా ఉంటాయి.
రోజూ ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు 3 నుండి 7 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవాలనుకునే వారు గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గుమ్మడికాయలో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఈ విధంగా ఈ జ్యూస్ లను తీసుకోవడం వల్ల మనం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో ఏదో ఒక జ్యూస్ ను మాత్రమే రోజూ తీసుకోవాలని అప్పుడే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.