Kids Health In Summer : వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవులు వస్తాయి. దీంతో వారు రోజంతా ఆడుకుంటూనే ఉంటారు. కొందరైతే ఎండలోనే ఆడుకుంటూ ఉంటారు. ఇలా రోజంతా ఆడేసి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. ఆడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, తినడం ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటారు. అయితే వేసవికాలంలో పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని ఎక్కువగా ఎండలో ఆడుకోనివ్వదని నిపుణులు చెబుతున్నారు. చల్లటి ఆహారాలను తీసుకోవడం, బయట లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, అలాగే ఏసీలలో ఉండడం వల్ల పిల్లల్లో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. పిల్లలు ఎండలో ఆడుకోవడం వల్ల వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైన ఉంటాయి.
దీంతో పిల్లల శరీరం వేడిగా ఉండడం, జ్వరం బారిన పడడం, గొంతు ఎండిపోవడం, అలాగే వారు కళ్లు తిరిగి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎండలో ఆడుకోవడం వల్ల చర్మం కందిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చర్మం ఎర్రబడడం, చర్మం రంగు మారడం జరుగుతుంది. అలాగే వేసవికాలంలో ఉండే ఉష్ణోగ్రత, తేమ కారణంగా బ్యాక్టీరియా త్వరగా వృద్ది చెందుతుంది. దీంతో ఆహారం విషతుల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీటి ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీని వల్ల కడుపులో నొప్పి, నీళ్ల విరోచనాలు, జ్వరం, కామెర్లు వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేసవికాలంలో పిల్లలు ఎక్కువగా డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఆటలు ఆడుకుంటూ నీటిని తాగడం మానేస్తారు.
దీంతో వారిలో నీటిశాతం తగ్గి డీ హైడ్రేషన్ బారిన పడతారు. పిల్లలను ఎక్కువగా ఎండలో ఆడుకోనివ్వడం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సమస్యలు తలెత్తుతాయని పిల్లలను ఆడుకోనివ్వకుండా చేయకూడదు. కొన్ని జాగ్రత్తలను తీసుకుంటూ పిల్లలను ఆడుకోనివ్వాలి. పిల్లలకు ఎక్కువగా నీటిని ఇస్తూ ఉండాలి. శీతల పానీయాలను, ఐస్ క్రీమ్స్ ను కాకుండా నీటిని ఎక్కువగా ఇవ్వాలి. ఇంట్లోనే తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ లను ఇవ్వాలి. అలాగే బయట ఆహారాలను ఎక్కువగా ఇవ్వకూడదు. వారు ఎల్లప్పుడు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అలాగే చేతులు, కాళ్లను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలి. పిల్లలకు, దోమలు, పురుగులు కుట్టకుండా చూసుకోవాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు వేసవికాలంలో అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని నిపుణులుచెబుతున్నారు.