Magnesium Deficiency Symptoms : మన సక్రమంగా పని చేయాలంటే ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. మెగ్నీషియం మన శరీరంలో అనేక కీలక విధులను నిర్వర్తిస్తుంది. దాదాపు 300 కంటే ఎక్కువ జీవరసాయన ప్రతిచర్యలల్లో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల పనితీరును, నరాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మెగ్నీషియం చాలా అవసరం. అలాగే క్యాల్షియం స్థాయిలను అదుపులో ఉంచి ఎముకలను ధృడంగా ఉంచడంలో కూడా మెగ్నీషియం మనకు దోహదపడుతుంది. ఇక రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, శరీరంలో జీవక్రియలను మెరుగుపరచడంలో కూడా మెగ్నీషియం మనకు సహాయపడుతుంది.
ఈవిధంగా అనేక రకాలుగా మెగ్నీషియం మనకు అవరమవుతుంది. అయితే మనం మెగ్నీషియం ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మెగ్నీషియం లోపం తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం తలెత్తడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది మెగ్నీషియం లోపం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి తెలియక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు మన శరీరంలో మెగ్నీషియం లోపం రావడం వల్ల మనలో కనిపించే లక్షణాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెగ్నీషియం లోపించడం వల్ల నరాల పనితీరు దెబ్బతింటుంది. దీంతో నరాల తిమ్మిర్లు, నరాలల్లో సూదులు గుచ్చినట్టు ఉండడం, నరాలు పట్టేసినట్టు ఉండడం వంటివి జరుగుతాయి.
మెగ్నీషియం లోపించడం వల్ల హృదయ స్పందనలు క్రమరహితంగా ఉంటాయి. కొన్నిసార్లు గుండె దడకు ఇది దారి తీస్తుంది. మెగ్నీషియం లోపించడం వల్ల కండరాలు బలహీనంగా తయారవుతాయి. దీని వల్ల కండరాలు మెలిపెట్టినట్టు అవ్వడం, వణుకు రావడం జరుగుతుంది. మెగ్నీషియం లోపించడం వల్ల జీర్ణ కండరాల పనితీరు కూడా మందగిస్తుంది. దీంతో వాంతులు, ఆకలి లేకపోవడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెగ్నీషియం లోపించడం వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. న్యూరోట్రాన్స్మిటర్ ల పనితీరు మందగిస్తుంది. దీంతో తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మన శరీరంలో శక్తి ఉత్పత్తికి మెగ్నీషియం అవసరమవుతుంది. మెగ్నీషియం లోపించడం వల్ల తగినంత శక్తి ఉత్పత్తి అవ్వక బలహీనత, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెగ్నీషియం లోపించడం వల్ల ఒత్తిడి, ఆందోళన, భయాందోళన భావాలు ఎక్కువగా కలుగుతాయి. అంతేకాకుండా మెగ్నీషియం లోపం నిద్రలేమికి కూడా దారి తీస్తుంది. ఇలా మెగ్నీషియం లోపం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.