Nutrition In Corn : వర్షాకాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిల్లో మొక్కజొన్న పొత్తులు కూడా ఒకటి. చల్లటి వర్షంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులను కాల్చుకుని తింటే ఈ అనుభూతే వేరుగా ఉంటుంది. చాలా మంది వర్షం పడేటప్పుడు వేడి వేడిగా బజ్జీలు, సమోసాలు, టీ వంటి వాటిని తీసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ వీటికి బదులుగా మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న పొత్తులను తినడం వల్ల మనం మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అసలు మొక్కజొన్న పొత్తులను మనం ఎందుకు తీసుకోవాలి.. వీటిలో ఉండే పోషకాలు ఏమిటి.. మొక్కజొన్న పొత్తులను తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల మొక్కజొన్న గింజలల్లో 19 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 9.4 గ్రాముల ప్రోటీన్, 88 క్యాలరీ శక్తి, 1.4 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇవే కాకుండా ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ బి6, థయామిన్, రైబోప్లేవిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడే వారు మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుంది. అంతేకాకుండా మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. సన్నగా వారు మొక్కజొన్న పొత్తులను తినడం వల్ల బరువు పెరుగుతారు. ఈ విధంగా మొక్కజొన్న పొత్తులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది వీటికి ఉప్పు, కారం జత చేసి తీసుకుంటూ ఉంటారు.
మొక్కజొన్న పొత్తులను ఉడికించి , కాల్చుకుని వాటిపై ఉప్పు, కారం, నిమ్మరసం వేసి తింటూ ఉంటారు. అలాగే గింజలను వేయించి తీసుకుంటూ ఉంటారు. కొందరు వీటితో గారెలను తయారు చేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల మొక్కజొన్న పొత్తుల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న పొత్తులను ఉడికించి సలాడ్ రపంలో తీసుకోవాలని అలాగే వీటిని కాల్చి తీసుకున్నప్పటికి ఉప్పు, కారం లేకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మొక్కజొన్న పొత్తులను పూర్తిగా ఉడికించిన తరువాత లేదా కాల్చుకున్న తరువాత మాత్రమే తీసుకోవాలని పచ్చిగా తీసుకుంటే కడుపునొప్పి, అజీర్తి, డయేరియా వంటి జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇవి విరివిగా లభించడంతో పాటు చాలా తక్కువ ధరలో లభిస్తాయి కనుక వీటిని తప్పకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు.