Sleeplessness : మారిన జీవన విధానం కారణంగా తలెత్తుతున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. చాలా మంది నేటి తరుణంలో ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఆర్థిక సమస్యలు, మారిన ఆహారపు అలవాట్లు, కుటుంబ కలహాలు, వాతావరణ మార్పులు.. ఇలా అనేక రకాల కారణాల చేత నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఇలా రోజూ తగినంత నిద్రలేకపోవడం చేత మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. రోజూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి సరిగ్గా నిద్రపట్టడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటిని వాడడం వల్ల మనం దీర్ఘకాలికంగా సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడే వారు నిద్రమాత్రలకు బదులుగా కొన్ని సహజ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమిని తగ్గించే సహజ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనెతో మర్దనా చేసుకోవాలి. దీని కోసం ముందుగా పాదాలను శుభ్రంగా కడగాలి. తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత గోరు వెచ్చని నూనెతో మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాలకు రక్తప్రసరణ పెరిగి చక్కగా నిద్రపడుతుంది. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలల్లో పసుపును కలిపి తీసుకోవాలి.
పసుపులో ఉండే కర్కుమిన్ మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్ర పట్టేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చక్కగా నిద్రపడుతుంది. అదే విధంగా రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో లావెండర్ ఆయిల్ ను కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. వీటితో పాటు నిద్రపోయే ముందు ధ్యానం చేయాలి. సెల్ ఫోన్స్, టివి, కంప్యూటర్స్ వంటి వాటిని చూడడం తగ్గించాలి. అలాగే రాత్రి భోజనాన్ని తేలికగా తీసుకోవాలి. అలాగే భోజనాన్ని త్వరగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.