Sleeplessness : మన శరీరానికి నిద్ర చాలా అవసరం. మనం రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం. రోజూ తగినంత నిద్రపోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలేమితో బాధపడడం వల్ల మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి మన శరీరానికి తగినంత నిద్ర అందడం లేదని అర్థం చేసుకోవచ్చు. నిద్రలేమి కారణంగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి కారణంగా మనకు రోజంతా అలసటగా ఉంటుంది. చిన్న చిన్న పనులకే మనం ఎక్కువగా అలిసిపోతూ ఉంటాము.
అలాగే నిద్రలేమి కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనా శక్తి సన్నగిల్లుతుంది. ఏ పనిని కూడా ఏకాగ్రతతో చేయలేకపోతారు. అదే విధంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కోపం, చిరాకు పెరుగుతుంది. తరుచూ భావోద్వేగానికి గురి అవుతారు. ఇక శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆకలి హార్మోన్లకు అంతరాయం కలుగుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ ను తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. దీంతో మనం బరువు పెరుగుతాము. అలాగే నిద్రలేమితో బాధపడే వారిలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు తరుచూ అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. అలాగే నిద్రలేమి కారణంగా మన శరీరం సమన్వయాన్ని కోల్పోతుంది. దీంతో గాయాలు,ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే నిద్రలేమి కారణంగా పొడిబారడం, కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వంటివి జరుగుతాయి. అలాగే నిద్రలేమి కారణంగా జీవక్రియలో అనేక మార్పులు వస్తాయి. దీంతో శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా మనం బరువు పెరుగుతాము. అలగే నిద్రలేమి కారణంగా మొటిముల, మచ్చలు, కళ్ల కింద వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా తగినంత నిద్రలేని వారిలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. ఈ లక్షణాలను బట్టి మన శరీరానికి తగినంత నిద్ర అందడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య నుండి బయటపడాలంటే రోజూ ఒకే సమయానికి నిద్రలేవడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
వారాంతరాల్లో కూడా ఒకే సమయానికి నిద్రలేవాలి. అలగే పుస్తకాలు చదవడం, వేడి నీటితో స్నానం చేయడం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. అలాగే నిద్రించే గదిలో నిద్రకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలో చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. సౌకర్యవంతమైన దిండ్లను, పరుపులను ఉపయోగించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి నిద్రను మనం సొంతం చేసుకోగలుగుతాము. దీంతో నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.