Soaked Raisins : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎండుద్రాక్ష కూడా ఒకటి. ఎండుద్రాక్ష చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అలాగే మనం వివిధ రకాల తీపి పదార్థాల తయారీలో కూడా వీటిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఎండుద్రాక్ష రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే వీటిని నేరుగా తినడానికి బదులుగా నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ రాత్రి పడుకునే ముందు నీటిలో ఎండుద్రాక్షను వేసి రాత్రంతా నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. నానబెట్టిన ఎండుద్రాక్షతో పాటు ఆ నీటిని కూడా తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నానబెట్టిన ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, ఫ్రీరాడికల్స్ ను నశింపజేయయడంలో మనకు సహాయపడతాయి. నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రేగులల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మనం మలబద్దకం వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఎండుద్రాక్షలో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దీంతో మనం కాలానుగుణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే వీటిని నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలసట, నీరసం వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. నానబెట్టిన ఎండుద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో క్యాల్షియం, బోరాన్ వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. ఎముకలు గుల్లబారడం, బోలు ఎముకలు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎండుద్రాక్షలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎండుద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతగానో సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా ఎండుద్రాక్షలను నానబెట్టి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వీటిని తప్పకుండా అందరూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.