Sugar Patients Diet : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. షుగర్ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి నెలకొంది. అతి మూత్రం, చూపు మందగించగడం, అతి దాహం, కారణం లేకుండా బరువు తగ్గడం, నీరసం వంటి వాటిని షుగర్ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు. తరచూ పరీక్షలు చేయించుకుంటూ తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల నెమ్మదిగా మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాలి. వీళ్లు తినకూడని కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉంటాయి.
షుగర్ వ్యాధి గ్రస్తులు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధి గ్రస్తులు తీసుకోకూడని ముఖ్యమైన ఆహార పదార్థాల్లో వైట్ బ్రెడ్ ఒకటి. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బ్రెడ్ లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు వైట్ బ్రెడ్ ను తక్కువగా తీసుకోవాలి. అలాగే కొవ్వు ఉన్న పాలను, పాల పదార్థాలను కూడా తీసుకోకూడదు. పాలల్లో ఉండే ఫ్యాట్ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎక్కువ హానిని కలిగించే అవకాశం ఉంది. ఇక మధుమేహ వ్యాధి గ్రస్తులు తినకూడని మరో పదార్థం తెల్ల అన్నం. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి.
కనుక మధుమేహ వ్యాధి గ్రస్తులు తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే మరో ఆహార పదార్థం బంగాళాదుంప. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు షుగర్ వ్యాధి లేని వారికి కూడా త్వరగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తీసుకునే వారు 18 శాతం త్వరగా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఎండు ద్రాక్షను కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక మధుమేహ వ్యాధి గ్రస్తులు వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగే షుగర్ తో బాధపడే వారు సాఫ్ట్ డ్రింక్ ను, ఎనర్జీ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తీసుకోకూడదు.
వీటిలో చక్కెరలతో పాటు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు షుగర్య వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కృత్రిమ చక్కెరలను కూడా మధుమేహ వ్యాధి గ్రస్తులు అస్సలు తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. కనుక వీటికి కూడా దూరంగా ఉండాలి. అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు మటన్ ను ఎక్కువగా తీసుకోకూడదు. దీనిని తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి పెరిగే అవకాశం ఉంది. మటన్ కు బదులుగా చికెన్, చేపలు, రొయ్యలు వంటి ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలే. కనుక కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. షుగర్ వ్యాధి వచ్చిన తరువాత ఆహార నియమాలను పాటించడం కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.