Ridge Gourd Pulp Chutney : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. మనం సాధారణంగా బీరకాయపై ఉండే పొట్టును తీసేసి బీరకాయలను కూరగా వండుకుని తింటూ ఉంటాం. బీరకాయపై ఉండే పొట్టును చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ ఈ పొట్టుతో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. బీరకాయ తొక్కుతో పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఎంతో కమ్మగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ తొక్కు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 10 నుండి 12, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, బీరకాయ తొక్కు – అరకిలో బీరకాయల నుండి తీసినంత, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – చిన్న నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 3, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
బీరకాయ తొక్కు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత నువ్వులు వేసి వేయించాలి. తరువాత బీరకాయ తొక్కు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించాలి. తరువాత చింతపండు వేసి కలపాలి. దీనిపై మరలా మూతను ఉంచి బీరకాయ తొక్కు మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే రెండు టేబుల్ స్పూన్ల వేడి నీటిని పోసుకుని పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ తొక్కును పడేయకుండా ఇలా పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.