Sunnam : ఈ భూమి మీద మనకు ఔషధంగా పనికి రానిది ఏది లేదని ఆయుర్వేదం చెబుతుంది. ఇలా మనకు ఔషధంగా పనికి వచ్చే వాటిల్లో సున్నం ఒకటి. దీనిని చాలా మంది తమలపాకులో వేసుకుంటూ ఉంటారు. అలాగే గోడలకు కూడా వేస్తూ ఉంటారు. కానీ సున్నంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సున్నంలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని ఉపయోగించి మనం ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సున్నాన్ని సుధా అని కూడా అంటారు. అలాగే దీనిని ఆయుర్వేదంలో చూర్ణా అని అంటారు. సున్నంలో కూడా రకాలు ఉంటాయి. సున్నాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేసే పద్దతిని బట్టి వీటికి పేర్లు ఉంటాయి.
ముందుగా సున్నం రాయి గనుల నుండి వస్తుంది. దీనిని లైమ్ స్టోన్( కాల్షియం కార్బోనేట్) అంటారు. దీనిని బట్టిలో పెట్టి కాల్చడం వల్ల లైమ్ తయారవుతుంది. దీనిని కాల్షియం ఆక్సైడ్ అంటారు. ఈ లైమ్ నీటిని చేర్చడం వల్ల గుల్ల సున్నం తయారవుతుంది. దీనిని హైడ్రేటెడ్ లైమ్ లేదా స్లెక్డ్ లైమ్ అని అంటారు. ఈ సున్నాన్నే ఆహార పదార్థాల తయారీలో, పేట తయారీలో, తమలపాకులో వినియోగిస్తారు. అదే విధంగా ఆయుర్వేదంలో ప్రత్యేక పద్దతిలో సున్నం తేటను తయారు చేస్తారు. 5 భాగాల డిస్టిల్డ్ వాటర్ లో 2 భాగాల సున్నం రాళ్లను వేసి 12 గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాత దీనిని ఫిల్టర్ పేపర్ తో వడకట్టాలి. ఇలా వడకట్టగా వచ్చిన దానినే సున్నం తేట, చూర్ణోదకం అని పిలుస్తారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సున్నం మనకు ఉపయోగపడుతుంది.
అరుచి, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో సున్నం మనకు ఉపయోగపడుతుంది. చిటికెడు సున్నాన్ని, ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అజీర్తి, అరుచి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక టీ స్పూన్ సున్నాన్ని ఒక టీ స్పూన్ వేపాకు రసంలో కలిపి తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి. అలాగే రెండు లేదా మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవాలి. తేటు కాటుకు గురి అయినప్పుడు సున్నంతో ఈ విధంగా ప్రథమ చికిత్స చేసుకుని తరువాత వైద్యున్ని సంప్రదించాలి. అలాగే కాలిన గాయాలను తగ్గించడంలో కూడా మనకు సున్నం ఉపయోగపడుతుంది. సున్నం తేటకు కొబ్బరి నూనె లేదా మీగడ లేదా అవిసెగింజల నూనె లేదా గుగ్గిలం కలిపి రాయాలి. ఇలా చేయడం వల్ల కాలిన గాయాలు తగ్గుతాయి. చాలా మంది స్త్రీలు రొమ్ము నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ సమస్యను తగ్గించడంలో కూడా సున్నం మనకు ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ సున్నాన్ని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి పట్టులా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొమ్ము నొప్పి తగ్గుతుంది. అలాగే ఎముకలు విరిగినప్పుడు, గాయాల కారణంగా వాపు వచ్చినప్పుడు ఒక టీ స్పూన్ సున్నాన్ని ఒక టీ స్పూన్ వెన్నతో కలిపి పట్టులా వేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా సమస్య నుండి బయటపడవచ్చు. ఒక టీ స్పూన్ సున్నపు తేటను ఒక టీ స్పూన్ పాలతో కలిపి లోపలికి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. అలాగే ఒక టీ స్పూన్ సున్నపు తేటకు ఒక టీ స్పూన్ తుమ్మ జిగురును కలిపి తీసుకోవడం వల్ల అతిసారం సమస్య తగ్గుతుంది. ఈ విధంగా సున్నం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.