Coconut Milk Halwa : కొబ్బరి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టును మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా కొబ్బరి పాలు మనకు ఉపయోగపడతాయి. ఈ పాలను వంటల్లో వాడడంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ కొబ్బరి పాల హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాల హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి పాలు – 4 కప్పులు, బియ్యం పిండి – ఒక కప్పు, బెల్లం – 200 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
కొబ్బరి పాల హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా ఒక గిన్నెలో బెల్లం, మూడు కప్పుల కొబ్బరి పాలు పోసి బెల్లం కరిగే వరకు కలపాలి. తరువాత ఇందులోనే బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని ఉంచి ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలను పోసి వేడి చేయాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. బియ్యం పిండి మిశ్రమం దగ్గర పడిన తరువాత ఇందులో మరో కప్పు కొబ్బరి పాలను పోసి అంతా కలిసేలా కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ వేడి చేయాలి. బియ్యం పిండి మిశ్రమం కళాయికి అంటుకోకుండా వేరైన తరువాత నెయ్యి వేసి కలపాలి.
తరువాత దీనిని నెయ్యి పైకి తేలే వరకు కలుపుతూ వేడి చేయాలి. నెయ్యి పైకి తేలిన తరువాత యాలకుల పొడి, జీడిపప్పు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాల హల్వా తయారవుతుంది. దీనిని చల్లగా, వేడిగా ఎలా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా కొబ్బరి పాలతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.