Garlic : ఉల్లి తరువాత అంతటి మేలు చేసేది వెల్లుల్లి. వెల్లుల్లిని కూడా మనం వంటింట్లో విరివిరిగా అనేక రకాలుగా వాడుతూ ఉంటాం. దీనిలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పరగడుపున వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టూ తీసి తినడం వల్ల మెదడు చురుకుగా పని చేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
జలుబు, దగ్గు, కఫం వంటి వాటితో బాధపడే వారు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల చక్కని ఉపశమనం కలుగుతుంది. అలర్జీలు, దద్దుర్లు వంటివి బాధిస్తున్నప్పుడు వెల్లుల్లి రసాన్ని, అల్లం రసాన్ని కలిపి చర్మంపై లేపనంగా రాయడం వల్ల ఆయా చర్మ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కొందరిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల తరచూ దగ్గు, జ్వరం వంటి వాటి బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారు వెల్లుల్లి రెబ్బలను నేతిలో వేయించి క్రమం తప్పకుండా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అధిక బరువుతో బాధపడే వారు వెల్లుల్లిని పేస్ట్ గా చేసి అందులో తేనె కలిపి తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజూ పరగడుపున వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడి షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం వల్ల నోట్లోని హానికారక బాక్టీరియా నశించి దంత సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. గ్లాస్ పాలలో మిరియాల పొడి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగడం వల్ల ఎంతో కాలం నుండి వేధిస్తున్న దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. ముఖంపై మొటిమలు, తెల్ల మచ్చలు ఇబ్బంది పెడుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా ఉడికించి మొటిమలు, మచ్చలపై రాయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.
గోరు చుట్టు సమస్యతో బాధపడుతున్నప్పుడు వెల్లుల్లిని మెత్తగా దంచి గోరు చుట్టు సమస్య ఉన్న వేలుపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా గోరు చుట్టు సమస్య తగ్గిపోతుంది. ఈ విధంగా వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని పరగడుపున తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.