ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో మనపై దాడి చేసేందుకు అనేక రకాల సూక్ష్మ జీవులు పొంచి ఉంటాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధులు సరే సరి. దీంతోపాటు మన జీర్ణవ్యవస్థపై కూడా వర్షాకాలం ప్రభావాన్ని చూపిస్తుంది. మన శరీరానికి అనేక ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉంటాయి. అయితే పోషకాలు బాగా ఉండే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను వర్షాకాలంలో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
1. వర్షాకాలంలో సహజంగానే చాలా మంది మొక్కజొన్నలను తింటుంటారు. ఇవి చాలా బలవర్ధకమైన ఆహారం. ఈ సీజన్‌లో మొక్కజొన్నలను కచ్చితంగా తినాలి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలలో లుటీన్ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. మొక్కజొన్నలో ఉండే ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మొక్కజొన్నలను నిప్పులపై కాల్చి లేదా ఉడకబెట్టుకుని తినవచ్చు. సలాడ్స్‌లోనూ తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
2. వర్షాకాలంలో సహజంగానే జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే అరటి పండ్లను తినడం వల్ల ఆ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. అరటి పండ్లలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో అరటి పండ్లను తినడం మరిచిపోకండి.
3. కోడిగుడ్లను సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చు. కానీ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. గుడ్లలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తాయి. అందువల్ల ఈ సీజన్‌లో కోడిగుడ్లను కచ్చితంగా తినాలి.
4. లిచీ, బొప్పాయి, దానిమ్మ పండ్లు, పియర్ పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి లభిస్తుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీపీని తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తాయి. అలాగే నేరేడు పండ్లు కూడా ఈ సీజన్‌లో అధికంగా లభిస్తాయి. కనుక వీటిని కూడా తినాలి. వీటి ద్వారా ఐరన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు లభిస్తాయి.
5. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవాలంటే శరీరాన్ని ఎల్లప్పుడూ ద్రవాలతో సమతుల్యంగా ఉంచాలి. అందుకు గాను తరచూ కొబ్బరినీళ్లను తాగాలి. దీంతో శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరినీళ్లు మేలు చేస్తాయి. కొబ్బరినీళ్లలో నిమ్మరసం లేదా పైనాపిల్ జ్యూస్‌ను కలుపుకుని తాగితే మంచిది. దీంతో విటమిన్ సి స్థాయిలు పెరుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365