మెదడు అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. కంప్యూటర్‌కు హార్డ్ డిస్క్ ఎలాంటిదో మన శరీరానికి మెదడు కూడా అలాంటిదే. ఎన్నో జ్ఞాపకాలను అది భద్రపరుచుకుంటుంది. శరీరంలోని అన్ని అవయవాలతో మెదడు అనుసంధానం అవుతుంది. అందుకే మనకు ఎక్కడ ఏ చిన్న దెబ్బ తాకినా వెంటనే మెదడు స్పందిస్తుంది. అయితే మనం చేసే పలు పనుల వల్ల మెదడు ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతుందని మీకు తెలుసా..? అవును, చాలా మంది ఆ పనుల గురించి పెద్దగా ఆలోచించరు. అయితే వాటి గురించి తెలుసుకుంటే తద్వారా మనం మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఈ క్రమంలో మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. ఎందుకంటే గత రాత్రి తిన్న ఆహారం తరువాత చాలా ఎక్కువ సమయం పాటు శరీరం శక్తి కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో మెదడు యాక్టివ్ గా పనిచేయాలన్నా, ఉదయాన్నే తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి చక్కగా పనిచేయాలన్నా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. లేదంటే శరీరానికి శక్తి సరిగ్గా అందదు. గ్లూకోజ్ లెవల్స్ పడిపోతాయి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. ఏ పనిచేయలేరు.
కొందరు చిన్న విషయాలకు కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. అయితే అది మంచిది కాదు, ఎందుకంటే అలా అయితే మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అది మెదడులో ఉండే రక్త నాళాలను బ్లాక్ చేస్తుంది. దీంతో మానసిక శక్తి సన్నగిల్లుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు, గ్లూకోజ్ ఎక్కువగా అందే కార్బొహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే మెదడుకు పోషణ సరిగ్గా అందదు. దీంతో అది సరిగ్గా డెవలప్ కాదు. మానసికంగా ఎదగలేరు. పొగ తాగడం మంచిది కాదు. దాంతో మెదడు కుచించుకుపోతుంది. ఫలితంగా అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి వస్తుంది. మెదడు పనితనం తగ్గుతుంది. రోజూ తగినంత సమయం పాటు నిద్రపోవాలి. నిద్ర తక్కువగా పోతే మెదడుకు విశ్రాంతి అందదు. ఫలితంగా మెదడు కణాలు నశిస్తాయి. అది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.
గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండరాదు. ఉంటే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఫలితంగా మెదడు కణాలు నాశనమవుతాయి. దీంతో మెదడు పనితనంపై ప్రభావం పడుతుంది. చాలా మంది అనారోగ్యంగా ఉన్నాగానీ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అలాంటి స్థితిలో పనిచేస్తే మెదడుపై అధిక భారం పడుతుంది. ఫలితంగా దానిపై ఒత్తిడి పెరిగి అనారోగ్యం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. నిద్రించేటప్పుడు కొందరు తలకు ఏదైనా చుట్టుకుని, కట్టుకుని పడుకుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మెదడు నుంచి కార్బన్ డయాక్సైడ్ సరిగ్గా బయటకు పోదు. ఫలితంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.
నిత్యం రొటీన్ లైఫ్ గడిపే వారు అప్పుడప్పుడు మెదడుకు పని కల్పించే విధంగా యత్నించాలి. సుడోకు ఆడడం, పజిల్స్ నింపడం, ఏవైనా క్రియేటివ్‌గా ఆలోచించి వాటిని తయారు చేయడం వంటి పనులు చేస్తే మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కొందరు అవసరం ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. అది మంచిది కాదు. మితభాషిగా ఉండడం కరెక్టే. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అనర్గళంగా మాట్లాడాలి. దీంతో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.