హెల్త్ టిప్స్

మీ కంటి చూపు సహజసిద్ధంగా మెరుగు పడాలా ? వీటిని తీసుకోండి..!

ప్రస్తుత తరుణంలో రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా తరగతులను వినడం వల్ల ఎక్కువ సేపు సెల్ ఫోన్, లాప్ టాప్ ల ముందు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కువ సమయం పాటు మన దృష్టిని ఈ స్క్రీన్ ల పై ఉంచడం వల్ల మన కళ్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలోనే కళ్ళు మంటలు ఏర్పడటం, కంటి నుంచి నీరు కారడం, కళ్ళు ఎర్రబడటం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి సహజ సిద్ధంగా లభించే ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

1. చేపలు

వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం రోజు వారి ఆహారంలో చేపలు తీసుకోవడం ఎంతో అవసరం. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.

2. కోడిగుడ్లు

కోడిగుడ్లలో విటమిన్లు, ప్రొటీన్లు, లుటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక రోజూ కోడిగుడ్లను తీసుకోవాలి.

3. ఆకుకూరలు

పాలకూర, బ్రోకలీ, అవకాడో వంటి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరచుకోవచ్చు. ఈ ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.

4. సిట్రస్ జాతికి చెందిన పండ్లు

నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లలో అధిక భాగం విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన కంటిలో ఏర్పడే సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కనుక ఈ పండ్లను రోజూ తీసుకోవాలి.

5. నట్స్

బాదం, పిస్తా వంటి వివిధ రకాల నట్స్ లో ఎక్కువగా విటమిన్ ఇ, ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేయటం ద్వారా కంటి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతో కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.


ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Sailaja N

Recent Posts