Hair Fall : ప్రస్తుత తరుణంలో చాలా మంది హెయిర్ ఫాల్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం అన్నది చాలా మందికి సమస్యగా మారింది. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా జుట్టు రాలడం అనే సమస్యతో అవస్థలు పడుతున్నారు. దీని వల్ల క్రమంగా వెంట్రుకలన్నీ పోయి బట్టతల కూడా వస్తోంది. కనుక జుట్టు రాలడం అన్నది మొదలు కాగానే మనసులో ఆందోళన ప్రారంభం అవుతుంటుంది. అయితే జుట్టు రాలేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ మూడు పూటలా కచ్చితంగా భోజనం చేయాలి. అంతగా అవసరం అయితే రాత్రి పూట తినకపోయినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ ఉదయం, మధ్యాహ్నం మాత్రం తప్పనిసరిగా భోజనం చేయాలి. వీటి వల్లే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇవి మన శరీరాన్ని మాత్రమే కాదు.. జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఉదయం, మధ్యాహ్నం భోజనం తప్పకుండా చేయాలి.
ఇక కొందరు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు. అలా కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
కొందరు తడి జుట్టు ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వుకుంటారు. ఇలా చేయరాదు. తడి జుట్టు త్వరగా రాలిపోతుంది. కనుక అది పూర్తిగా ఆరిన తరువాతే దువ్వెనతో దువ్వుకోవాలి. లేదంటే జుట్టు బాగా రాలిపోతుంది. ఇక జుట్టును మరీ బంధించినట్లు ముడి వేయరాదు. అలా చేసినా జుట్టు త్వరగా రాలిపోతుంది. దీంతోపాటు హెయిర్ డ్రయర్స్ వాడకం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కనుక వాటిని వాడరాదు. అలాగే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన షాంపూలను లేదా కుంకుడు కాయ రసాన్ని వాడాలి. దీంతో జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక కొందరు వేసుకునే కొన్ని రకాల మెడిసిన్ల వల్ల కూడా జుట్టు రాలుతుంది. ముఖ్యంగా యాంటీ డిప్రెషన్, యాంటీ యాంగ్జయిటీ, యాంటీ హైపర్ సెన్సిటివ్, థైరాయిడ్ మందులు జుట్టు రాలడాన్ని ప్రోత్సహిస్తాయి. కనుక ఈ మందులను వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి. దీంతో జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.