Hair Problems : నల్లని, ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. మనకు ప్రతి నెల ఒక అంగుళం వరకు జట్టు పెరుగుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం, జీవన విధానం, పోషకాహార లోపం, ఇతర అనారోగ్యాలకు చికిత్స తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలకుండా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపూలను, నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు. చాలా తక్కువ ఖర్చుతోనే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతోపాటు జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలిపి తలకు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన ఒక గంట తరువాత కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయలను ముక్కలుగా కోసి జార్ లో వేసి అందులోనే తగినన్ని నీళ్లు పోసి మొత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం నుండి ఉల్లిపాయ రసాన్ని తీసి ఆ రసాన్ని తలకు బాగా పట్టించి కుదుళ్లలోకి ఇంకేలా మసాజ్ చేయాలి. ఇలా చేసిన ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కాకర కాయరసంలో పంచదారను కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. తలస్నానం చేసే ముందు తలకు పొద్దు తిరుగుడు నూనె రాసి తరువాత కుంకుడు కాయలతో లేదా శీకాకాయలతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులను వేసి వేడి చేయాలి. ఈ నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు రాసి మర్దనా చేసి ఒక గంట తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తూనే మనం ప్రతి రోజూ తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చుతోనే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇతర జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడంతోపాటు జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.