Dates : కాలం మారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, కనుక ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే చలికాలంలో ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఖర్జూరాలను పోషక విలువల రారాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఖర్జూరాలు ఒక వరం. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది.
2. ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతి రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల గుండె సమస్యలు మీ దరిచేరవు.
3. చాలా మంది మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలతో సతమతమవుతుంటారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి రెండు లేదా మూడు ఖర్జూరాలను తిని పడుకోవడం ద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది.
4. చలికాలంలో ప్రతి ఒక్కరినీ దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఒక గ్లాస్ నీటిలో రెండు ఖర్జూరాలు, 5 నల్ల మిరియాలు వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిని వడబోసి తాగటం ద్వారా.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
5. ఆస్తమా సమస్యతో సతమతమయ్యే వారికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బాలింతలు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా ఖర్జూరాలతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.