మనకు అందుబాటులో ఉన్న అత్యంత అధికమైన పోషకాలు కలిగిన పదార్థాల్లో మునగ ఆకులు ఒకటి. వీటిల్లో ఉండే పోషకాలు ఏ కూరగాయల్లోనూ ఉండవు.. అంటే అతిశయోక్తి కాదు. మునగ ఆకుల్లో నారింజల కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది. క్యారెట్ల కన్నా 10 రెట్లు అధికమైన విటమిన్ ఎ ఉంటుంది. పాలలో కన్నా 17 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల మునగాకులు చేసే మేలు అంతా ఇంతా కాదు.
వర్షాకాలంలో మనకు సహజంగానే అనేక రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు వస్తుంటాయి. అందువల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఈ క్రమంలో రోజూ మునగాకుల నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
ఈ సీజన్‌లో సహజంగానే మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల వల్ల కొన్ని సార్లు మనం ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతుంటాం. అలాగే లివర్‌లో, శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. కనుక విష పదార్థాలను బయటకు పంపాలి. అందుకుగాను మునగాకుల నీళ్లు ఎంతగానో దోహదపడతాయి. రోజూ వీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అవకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఈ సీజన్‌లో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కనుక రోజూ మునగాకుల నీళ్లను తాగడం వల్ల ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
మునగాకుల నీళ్లను తాగితే మెదడు కూడా యాక్టివ్‌గా పనిచేస్తుంది. చిన్నారులు చురుగ్గా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కాబట్టి మునగాకుల నీళ్లను తప్పకుండా రోజూ ప్రతి ఒక్కరూ తాగాలి.
గుప్పెడు మునగాకులను సేకరించి బాగా కడిగి వాటిని నీటిలో వేసి మరిగించాలి. పది నిమిషాల పాటు మరిగాక ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు ఒక్కసారి కప్పు మోతాదులో మునగాకుల నీళ్లను తాగితే ఎంతగానో మేలు జరుగుతుంది.