రాత్రి పూట మనం ఆహారం తీసుకున్న తరువాత మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు సుమారుగా 12-14 గంటల విరామం వస్తుంది. దీంతో శరీరంలో ఉన్న శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఉదయం నిద్ర లేస్తూనే మనకు శక్తి అవసరం అవుతుంది. ఆహారం తీసుకోక చాలా సమయం విరామం వచ్చింది కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా చెబుతుంటారు.
అయితే రోజులో మనం ఉదయం తీసుకునే ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందులో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే శక్తి వచ్చేలా ఉండాలి. అలాంటి ఆహారాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజుకు కావల్సిన శక్తి, పోషకాల్లో చాలా వరకు ఉదయం తినే ఆహారం నుంచే మనకు లభిస్తాయి. దీని వల్ల ఉత్సాహంగా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎంత పనిచేసినా త్వరగా అలసిపోరు.
అయితే ఉదయం తీసుకునే శక్తివంతమైన, పోషకాలు కలిగిన ఆహారాల విషయానికి వస్తే నట్స్ ముఖ్య పాత్రను పోషిస్తాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన నట్స్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం మనకు ఎక్కువ మొత్తంలో శక్తి, పోషకాలు అవసరం అవుతాయి కనుక నట్స్ ను తింటే వాటిని భర్తీ చేయవచ్చు.
ముఖ్యంగా బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. వీటన్నింటినీ కలిపి ఉదయం ఒక కప్పు మోతాదులో తింటే సరిపోతుంది. దీని వల్ల అనేక పోషకాలతోపాటు శక్తి లభిస్తుంది. నట్స్ లో ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. దీని వల్ల కండరాల నిర్మాణం జరగడంతోపాటు కణాలకు మరమ్మత్తులు అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ఉదయం నట్స్ ను బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇన్ని రకాల లాభాలు ఉంటాయి కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్‌ను కచ్చితంగా తీసుకోవాల్సిందే..!