Potatoes : ఆలుగడ్డలు.. వీటినే బంగాళాదుంపలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేపుడు, చిప్స్ వంటి చిరుతిళ్లతోపాటు ఆలుగడ్డలను కూర చేసుకుని కూడా తింటారు. అయితే కూరగాయలతో పోలిస్తే బంగాళాదుంపల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల కూరగాయల్లో 20 నుంచి 30 వరకు క్యాలరీలు ఉంటే బంగాళాదుంపల్లో మాత్రం 97 క్యాలరీలు ఉంటాయి. కనుక ఆలుగడ్డలను ఎక్కువగా తినకూడదు. తింటే అధికంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే బంగాళా దుంపలకు చెందిన ఒక ముఖ్యమైన విషయాన్ని పలువురు సైంటిస్టులు ఈ మధ్యనే వెల్లడించారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలను కూరగా చేసుకుని తింటే వాటిల్లో ఉండే పలు సమ్మేళనాల కారణంగా మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే కేవలం ఉడకబెట్టి లేదా కూరగా చేసుకుని మాత్రమే ఆలుగడ్డలను తినాలి. చిప్స్, వేపుళ్లు వంటి వాటి రూపంలో ఆలుగడ్డలను తినకూడదు. తింటే కడుపు నిండిన భావన కాదు, కడుపు ఖాళీగా ఉన్న భావన అనిపిస్తుంది. ఎందుకంటే ఆలుగడ్డలను వేయిస్తే వాటిల్లో ఉండే ఆరోగ్యకరమైన సమ్మేళనాలు నశిస్తాయి. అలాంటప్పుడు ఆలును తింటే మనకు కడుపు నిండిన భావన కలగదు. ఫలితంగా మనం ఎక్కువగా తింటాం.
అందుకనే చిప్స్, వేపుళ్లు వంటివి చేసినప్పుడు చాలా మంది అధికంగా వీటిని లాగించేస్తుంటారు. ఎందుకంటే ఎంత తిన్నా వీటిని తిన్నాక కడుపు నిండిన భావన అనేది కలగదు. ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది. అదే కూరగా లేదా ఉడకబెట్టుకుని ఆలుగడ్డలను తింటే తక్కువగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. పైగా ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గవచ్చు. ఇలా ఆలుగడ్డలను తింటూ కూడా బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.