ఎసిడిటీ అనేది మనకు అనేక రకాల కారణాల వల్ల వస్తుంటుంది. కారం, మసాలాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తిన్నా.. కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు ఉండే ఆహారాలను అధికంగా తిన్నా.. సమయానికి తినకపోయినా.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా అసిడిటీ వస్తుంటుంది. అయితే కింద తెలిపిన సూచనలను పాటిస్తే అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
* ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ప్రతి ముద్దను బాగా నమిలి తినండి. మీరు తినే తిండిలో ఎక్కువ శాతం నోటిలోనే లాలాజలంతోనే కరిగిపోవాలి. అప్పుడు జీర్ణాశయంతో ఎక్కువ పని ఉండదు. కనుక ఆ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అసిడిటీ రాదు.
* అన్నం తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. ఆ తరువాత ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా నడవండి. దీంతో అసిడిటీ సమస్య తగ్గుతుంది.
* ఉదయం పూట ఒక అర చెంచా జీలకర్రను బాగా నమిలి తినండి. ఆ తరువాత ఒక గ్లాసు మంచి నీళ్ళను తాగండి. ఇది ఎసిడిటీని నయం చేయడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.
* భోజనం తరువాత 45 నిమిషాల వరకు నీటిని తాగకండి. 45 నిమిషాల తరువాత కుదిరితే వెచ్చటి నీటినే తాగండి. చల్లని నీళ్లను తాగితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
* మసాలాలు, ఎక్కువ నూనె ఉండే ఆహారాలను తగ్గించండి.
* మధ్యాహ్నం 2 గ్లాసుల మజ్జిగ తాగండి. మజ్జిగలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి తాగితే జీర్ణాశయానికి చాలా మంచిది.