Blood Donation : శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపివేస్తుంది.
అయితే ఇన్ని ఉపయోగాలున్న రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా బరువు తగ్గడం కూడా ఒకటి. అదేంటి రక్తదానం చేస్తే బరువు తగ్గుతారా..? అని ఆశ్చర్యపోతున్నారా..! అవును, రక్తదానం చేస్తే నిజంగానే బరువు తగ్గుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుదాం. మన శరీరంలో ఎముక మజ్జ (ఎముకలోని మధ్యభాగం)లో రక్తం తయారవుతుంది. వీటిలో మృదువుగా ఉండే కణజాలంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. అయితే ఎముక మజ్జ ముందుగా ఓ స్టెమ్ సెల్‌ను తయారు చేస్తుంది. ఈ స్టెమ్ సెల్ అపరిపక్వంగా ఉన్న ఎరుపు, తెలుపు రక్తకణాలను, ప్లేట్‌లెట్లను తయారు చేస్తుంది.
అయితే ఇలా అపరిపక్వంగా ఉన్న కణాలు మళ్లీ విభజించబడి ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లుగా మారుతాయి. ఇలా తయారైన వాటిలో తెల్ల రక్తకణాలు కొద్ది గంటల నుంచి కొన్ని రోజుల వరకు బతికి ఉంటాయి. అవే ఎర్ర రక్తకణాలైతే 120 రోజుల వరకు, ప్లేట్‌లెట్స్ అయితే 10 రోజుల వరకు బతికి ఉంటాయి. ఆ కాలం అయిపోగానే అవి మళ్లీ తయారవుతాయి. ఇక మనం రక్తదానం చేసినప్పుడు ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో శరీరం తక్షణమే రక్తం తయారు చేసుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఎముక మజ్జతోపాటు కిడ్నీలు కూడా వీలైనంత ఎక్కువ రక్తాన్ని తయారుచేసేలా పని ప్రారంభిస్తాయి.
ఎముక మజ్జలో పైన పేర్కొన్న విధంగా రక్తం తయారైతే కిడ్నీలు రక్తం తయారీ కోసం ఎరిత్రోపొటీన్ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. దీంతో రక్తం తయారవడం ప్రారంభమవుతుంది. కాగా రక్తదానం చేసిన వెంటనే 24 గంటల్లోగా కోల్పోయిన రక్తం తయారైపోతుంది. అనంతరం 2 వారాల్లోగా హిమోగ్లోబిన్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలా చేరుకునే క్రమంలో దానికి అధికంగా శక్తి కావల్సి వస్తుంది. అప్పుడది మన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు నిల్వలను వాడుకుంటుంది. ఈ క్రమంలో మన శరీరం నుంచి దాదాపు 500 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. దీంతో మనం సహజంగానే బరువు తగ్గుతాం.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తిలో దాదాపు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 45 కిలోలకు పైగా బరువున్న ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. 3 నెలలకోసారి వారు దాదాపు 350 ఎంఎల్ (ఒక యూనిట్) వరకు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తదానం చేయడానికి ముందు పలు వైద్య పరీక్షలు ఉచితంగా లభిస్తాయి.