Ghee : పాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనం ప్రతిరోజూ పాలను లేదా పాల నుండి తయారైన పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. యజ్ఞాలలో, యాగాలలో, హోమాలలో కూడా నెయ్యిని ఉపయోగిస్తారు. పాల నుండి తయారు చేసే వాటిల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యి గురించి మనందరికీ తెలుసు. నెయ్యిని రుచి చూడని వారు ఉండరు. నెయ్యి ఎంతో చక్కని వాసనను కలిగి ఉంటుంది. ప్రతి ఇంట్లో నెయ్యి తప్పకుండా ఉంటుంది. నెయ్యిని తీపి పదార్థాల తయారీతోపాటు వివిధ రకాల వంటల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
వెన్నను కరిగించగా వచ్చే ఈ నెయ్యి లేనిదే చాలా మంది భోజనం చేయరు. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి బలాన్ని చేకూర్చడంలో నెయ్యి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా నెయ్యిని ఔషధంగా ఉపయోగిస్తారు. మనం ఆవు నెయ్యిని, గేదె నెయ్యిని రెండింటినీ ఉపయోగిస్తాం. కానీ గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. నెయ్యిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తితోపాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. మెదడును చురుకుగా ఉంచడంలో, నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరచడంలో నెయ్యి మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, గాయాలు త్వరగా మానేలా చేయడంలో నెయ్యి మనకు దోహదపడుతుంది. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ నెయ్యి మనకు సహాయపడుతుంది. నెయ్యి వాడకంపై భిన్నాభిప్రాయలు వెల్లడవుతుంటాయి. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని కొందరు అంటుంటే మరికొందరు నెయ్యిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె పనితీరు మందగిస్తుందని మరికొందరు అంటున్నారు.
మనకు రోజుకు 1800 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. 2 టీ స్పూన్ల నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు 300 క్యాలరీల శక్తి లభిస్తుంది. కనుక మనం రోజుకు రెండు టీ స్పూన్ల పరిమాణంలో నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే మనం ఈ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. నెయ్యిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరగడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక నెయ్యిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.