శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో ఎప్పటికప్పుడు చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలు పని చేస్తాయి. అవేమిటంటే..
1. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆల్లిసిన్, అజోన్, ఎస్-అలైల్‌సిస్టీన్, ఎస్-ఈథైల్ సిస్టీన్, డైఅలైల్‌సల్ఫైడ్ అనే ఆర్గానిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎల్‌డీఎల్ ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. అందువల్ల రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుండాలి. నెల రోజుల పాటు రోజూ ఇలా తింటే కచ్చితంగా మార్పు వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడాన్ని మీరు గమనిస్తారు.
2. గ్రీన్ టీలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. పాలిఫినాల్స్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. అందువల్ల రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీని తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గిపోతుంది.
3. ధనియాలను సహజంగానే చాలా మంది కూరల్లో వేస్తుంటారు. ఆయుర్వేద ప్రకారం ధనియాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దోహదపడతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక వడకట్టి దాన్ని ఒక కప్పు మోతాదులో తాగాలి. రోజుకు 2 సార్లు ఈ విధంగా చేస్తుండాలి. కొలెస్ట్రాల్ తుడిచి పెట్టుకుపోతుంది.
4. మెంతులను నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. వీటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. విటమిన్ ఇ తో పాటు యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల మెంతులు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించగలవు. అందుకు గాను రాత్రి 2 టీస్పూన్ల మెంతులను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ మెంతులను తినాలి. లేదా ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 2 టీస్పూన్ల మెంతులను వేసి బాగా మరిగించి అనంతరం నీటిని వడకట్టి దాన్ని ఒక కప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాలి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.
5. ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల ఉసిరి కాయ రసం చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తుంది. అందుకుగాను రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 30 ఎంఎల్ మోతాదులో ఉసిరి రసం తాగాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి.