Anemia : మనలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పురుషులల్లో 14 నుండి 17.5 గ్రాముల వరకు స్త్రీలలో 12.3 నుండి 15.3 గ్రాముల వరకు ఉంటుంది. రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉంటే అది రక్త హీనత సమస్యకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్త హీనత వల్ల అలసట, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, తలనొప్పి, చర్మం పొడిగా తయారవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రక్త హీనత సమస్య నుండి మనం చాలా సులువుగా బయట పడవచ్చు.
వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలను ఉపయోగించి జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం రక్త హీనత సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఎలా తయారు చేసుకోవాలి.. ఈ జ్యూస్ ను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జ్యూస్ కోసం ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, ఒక కప్పు బెల్లం, ఒక పెద్ద నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా క్యారెట్ ముక్కలను జార్ లో వేసి కొద్దిగా నీళ్లను పోసి మెత్తగా చేసుకోవాలి. తరువాత జల్లి గంట లేదా వస్త్రం సహాయంతో మెత్తగా చేసుకున్న క్యారెట్ గుజ్జు నుండి రసాన్ని తీసుకోవాలి. ఇదే విధంగా బీట్ రూట్ నుండి కూడా రసాన్ని తీసుకుని క్యారెట్ రసంతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకుని పావు కప్పు నీళ్లను పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న క్యారెట్, బీట్ రూట్ రసాన్ని అందులో పోసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను పావు వంతు పరిమాణం తగ్గే వరకు మరిగించుకోవాలి. తరువాత నిమ్మ రసాన్ని పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ పూర్తిగా చల్లారిన తరువాత దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ఒక గ్లాసు నీటిలో 3 టేబుల్ స్పూన్ల చొప్పున వేసి కలిపి ఉదయం పరగడుపున లేదా మధ్యాహ్న భోజనానికి రెండు గంటల ముందు తాగడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది. ఊబకాయంతో బాధపుతున్న వారు ఈ జ్యాస్ ను తాగడం వల్ల బరువు తగ్గుతారు. నీళ్లలో కలుపుకుని ఈ జ్యూస్ ను ప్రతిరోజూ తాగడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.