మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఓ ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే చాలా తక్కువ ఖర్చులోనే అధిక బరువును తగ్గించే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో దాల్చిన చెక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువును తగ్గించి, శరీరానికి చక్కని ఆకృతిని ఇవ్వడంలో దాల్చిన చెక్క చక్కగా పని చేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు మన ఆకలిని తగ్గించి మనం తక్కువగా ఆహారాన్ని తీసుకునేలా చేస్తాయి. బరువు తగ్గడానికి మనకు దాల్చిన చెక్క మాత్రలు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. బరువు తగ్గడంలో దాల్చిన చెక్క ఎంతగా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మనం దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి గాను దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి.. అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం మనం ముందుగా దాల్చిన చెక్కను పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. పది నిమిషాల తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున, అలాగే రాత్రి భోజనానికి అర గంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ రెండు పూటలా రెండు గ్లాసుల చొప్పున తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
అదే విధంగా దాల్చిన చెక్క టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. ఒక గ్లాస్ నీళ్లలో రెండు పెద్ద దాల్చిన చెక్కముక్కలను వేసి ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి. దీనినే దాల్చిన చెక్క టీ అంటారు. ఈ టీ ని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే వంటల్లో దాల్చిన చెక్క పొడిని వాడడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. ఈ విధంగా దాల్చిన చెక్కను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటూనే ఆహార నియమాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.