నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే నిత్యం తాగే నీటిలో ఎలక్ట్రోలైట్‌లను కలుపుకుని తాగడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. అయితే ఇంతకీ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమిటి ? వాటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ? ఎలక్ట్రోలైట్ వాటర్‌ను ఎలా తయారు చేయాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరానికి నిత్యం పోషకాలు అవసరం అవుతాయి కదా. వాటిలో మినరల్స్ కూడా ఒకటి. వాటినే ఎలక్ట్రోలైట్స్ అని కూడా అంటారు. ఇవి మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల ద్వారా మనకు అందుతాయి. వీటి వల్ల అనేక శరీర విధులు సక్రమంగా నిర్వర్తించబడతాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం తదితర మినరల్స్ ను ఎలక్ట్రోలైట్స్ గా వ్యవహరిస్తారు.
* ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతాయి.
* శరీర పీహెచ్ స్థాయిలను నియంత్రిస్తాయి.
* కణాలకు పోషకాలను అందించేందుకు సహాయ పడతాయి.
* కణాల నుంచి వ్యర్థాలను బయటకు పంపుతాయి.
* నాడులు, కండరాలు, గుండె, మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.
* దెబ్బ తిన్న కణజాలాలకు మరమ్మత్తులు చేస్తాయి.
సాధారణంగా వ్యాయామం ఎక్కువగా చేసే వారు, క్రీడాకారులు ఎక్కువగా స్పోర్ట్స్ డ్రింక్స్‌ను తాగుతారు. వాటిల్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అవి చెమట వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేస్తాయి. దీంతోపాటు కండరాలు, కణాలకు కావల్సిన శక్తిని అందేలా చూస్తాయి. అందువల్లే వారు ఎక్కువగా ఆ డ్రింక్స్‌ను తాగుతారు.
సోడియం, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం తదితర మినరల్స్ ఉన్న నీటినే ఎలక్ట్రోలైట్ వాటర్ అంటారు. దీన్నే ఆల్కలైన్ వాటర్ అని కూడా పిలుస్తారు. ఈ నీటిని తాగడం వల్ల శరీర క్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. ఎండ దెబ్బకు గురి కాకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా ఉంటుంది.
250 ఎంఎల్ మోతాదులో నీటిని తీసుకుని అందులో పావు టీస్పూన్ ఉప్పు, పావు కప్పు నిమ్మరసం, ఒకటిన్నర కప్పుల కొబ్బరి నీళ్‌లు, 2 కప్పుల చల్లని నీరు కలపాలి. అన్నింటినీ బాగా కలిపి థర్మల్ ప్రూఫ్ బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. దీంతో బయటకు వెళ్లినప్పుడు ఆ బాటిల్‌ను వెంట ఉంచుకుంటే చాలు. శరీరానికి ఎప్పుడూ ఎలక్ట్రోలైట్స్‌ను అందించవచ్చు. అలాగే వేసవి తాపం నుంచి సురక్షితంగా ఉండవచ్చు.