Pomegranate Curd Smoothie : వేసవి తాపం కారణంగా చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకునే మార్గాలను అనుసరిస్తుంటారు. వేసవిలో ఇలా చేయడం సహజమే. అందులో భాగంగానే చల్లని పానీయాలు.. ఆహారాలను తాగుతుంటారు. శరీరానికి చలువ చేసే వాటినే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక అలాంటి వాటిల్లో పెరుగు దానిమ్మ స్మూతీ ఒకటి. దీన్ని తయారు చేసుకుని చల్ల చల్లగా తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం పోతుంది. అలాగే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక పెరుగు దానిమ్మ స్మూతీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు దానిమ్మ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చితక్కొట్టిన ఐస్ – ఒక కప్పు, చక్రాల్లా తరిగిన అరటి పండు ముక్కలు – రెండు కప్పులు, పెరుగు (వెన్న లేనిది) – అర కప్పు, దానిమ్మ రసం – అర కప్పు, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు (అలంకరణ కోసం) – మూడు టేబుల్ స్పూన్లు.
పెరుగు దానిమ్మ స్మూతీ తయారీ విధానం..
ఐస్, అరటి పండు ముక్కలు, పెరుగు, దానిమ్మ రసం, తేనె కలిపి మెత్తగా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి అదనంగా కొంత దానిమ్మ రసం కలుపుకోవాలి. దానిమ్మ గింజలతో అలంకరణ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. దీన్ని ఎవరైనా సరే తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల చలువ చేస్తుంది. వేడి మొత్తం తగ్గుతుంది. ఇంకా దానిమ్మ పండ్లలో ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి.