Idli Karam : మనం సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలను రకరకాల చట్నీలతో, సాంబార్ తో కలిపి తింటూ ఉంటాం. కొందరు కారంలో నెయ్యి వేసుకుని కూడా ఇడ్లీలను తింటూ ఉంటారు. ఇడ్లీలతో కలిపి తినే ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు మిర్చి – 15, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, మినపగుళ్ళు – 2 టేబుల్ స్పూన్స్, చింతపండు – 5 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత.
ఇడ్లీ కారం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మినప గుళ్ళు వేసి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిలోనే ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత చింతపండు, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిర్చితోపాటు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మిక్సీ పట్టుకున్న తరువాత మూత తీసి వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ కారం తయారవుతుంది. ఈ కారంలో నెయ్యి వేసుకుని ఇడ్లీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కారాన్ని దోశలపై చల్లుకుని కూడా తినవచ్చు.