Tulsi Kashayam : సీజన్లు మారే సమయంలో సహజంగానే ఎవరికైనా సరే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు నానా అవస్థలు పడుతుంటారు. 10 రోజుల వరకు ఇవి తగ్గవు. కనుక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కింద చెప్పిన విధంగా తులసి ఆకులతో కషాయం తయారు చేసుకుని తాగితే దాంతో ముందు చెప్పిన సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ వేగంగా తగ్గిపోతాయి. ఇక తులసి ఆకులతో కషాయం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకులతో కషాయం తయారీకి కావల్సిన పదార్థాలు..
తులసి ఆకులు – గుప్పెడు, అల్లం – చిన్న ముక్క, మిరియాలు – ఒక టీస్పూన్, నీళ్లు – ఒక కప్పు.
తులసి ఆకుల కషాయం తయారీ విధానం..
తులసి ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం దంచి పెట్టుకోవాలి. పెనంపై మిరియాలను సన్నని మంటపై వేయించాలి. తరువాత ఒక కళాయి తీసుకుని అందులో నీళ్లు పోసి దంచిన అల్లం వేసి మరిగించాలి. తులసి ఆకులు, మిరియాలు దంచుకోవాలి. ఈ దంచిన ముద్దను మరిగే నీటిలో వేసి బాగా కలపాలి. మూత ఉంచి ముప్పావు వంతు అయ్యే వరకు మరిగించాలి. దీంతో తులసి ఆకుల కషాయం తయారవుతుంది. దీన్ని గోరు వెచ్చగా అయ్యాక వడకట్టి తాగేయాలి. ఈ కషాయాన్ని ఇలా తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తాగితే చాలు.. దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.