Sweet Corn Soup : మనకు దేశీయ మొక్కజొన్న కేవలం సీజన్‌లోనే లభిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరికైనా సులభంగా లభిస్తుంది. పైగా ధర కూడా ఎక్కువేమీ ఉండదు. కనుక స్వీట్ కార్న్‌ను ఎవరైనా సరే సులభంగా కొనుగోలు చేసి తినవచ్చు. అయితే నేరుగా తినే కన్నా దీంతో సూప్ తయారు చేసుకుని తాగితే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే శరీరానికి శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. ఇక స్వీట్ కార్న్‌తో సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – ఒక కప్పు, ఉల్లికాడలు – అర కప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లు – మూడు కప్పులు, టమాటా సాస్ – ఐదు టీస్పూన్లు, దాల్చిన చెక్క – కొద్దిగా, జీలకర్ర – ఒక టీస్పూన్, మిరియాలు – టీస్పూన్, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, టమాటా – ఒకటి, పచ్చి మిర్చి – 4, ఉప్పు, చక్కెర – తగినంత.
స్వీట్ కార్న్ సూప్‌ను తయారు చేసే విధానం..
ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలాగే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకుని మూటలా కట్టాలి. ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్క జొన్నలను కూరగాయలు ఉడికించిన నీళ్లలో వేసి పొయ్యి మీద పెట్టాలి. కొద్ది సేపటికి ఉప్పు, ఉల్లికాడలు, టమాటా సాస్ వేసి బాగా మరిగించాలి. సూప్ చిక్కగా అవుతుంది. అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడి వేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా స్వీట్ కార్న్ సూప్‌ను తయారు చేసుకుని తాగితే ఓ వైపు శక్తి.. మరోవైపు పోషకాలు.. ఇంకోవైపు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.