Beetroot Juice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. దీన్ని తినేందుకు సహజంగానే చాలా మంది ఇష్టపడరు. కొందరు దీన్ని పచ్చిగానే తింటుంటారు. వాస్తవానికి బీట్‌రూట్ మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీంట్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఈ సీజన్‌లో మనకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. కనుక బీట్‌రూట్‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బీట్‌రూట్‌ను రోజూ నేరుగా తినలేమని అనుకునేవారు దీంతో జ్యూస్ చేసుకుని సులభంగా తాగవచ్చు. దీంతో కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఇక బీట్‌రూట్ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్ రూట్ ముక్కలు – ఒక కప్పు, చక్కెర – ఒక టీస్పూన్, అల్లం – చిన్న ముక్క, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని, నిమ్మరసం – అర టీస్పూన్.
బీట్ రూట్ జ్యూస్ తయారీ విధానం..
ఒక జార్ లో లేదా బ్లెండర్ లో బీట్ రూట్ ముక్కలను, పంచదారను, అల్లం ముక్కను, ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లు పోసి మరో 3 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. దీనిని వస్త్రం లేదా జల్లిగంటె సహాయంతో వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులోనే అవసరం అనుకుంటే నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బీట్ రూట్ జ్యూస్ తయారవుతుంది.
ఈ విధంగా బీట్ రూట్ జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని తయారీలో పంచదారకు బదులుగా బెల్లంను కూడా వేసుకోవచ్చు. బీట్ రూట్ లను తినలేని వారు ఇలా జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఎన్నో లాభాలు కలుగుతాయి.