Banana Flower Curry : అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయ. వీటిని తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్లు మాత్రమే కాదు.. అరటి పువ్వును కూడా మనం తినవచ్చు. దీంతోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీన్ని ఎలా తినాలి ? కూరలా ఎలా వండుకోవాలి ? అన్న విషయం చాలా మందికి తెలియదు. మరి దీంతో కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
అరటి పువ్వు కందిపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
అరటి పువ్వు – ఒకటి, కంది పప్పు – ఒక కప్పు, కరివేపాకు – రెండు రెబ్బలు, ఎండు మిర్చి – మూడు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, జీలకర్ర – ఒక టీస్పూన్, మిరప కారం – ఒక టీస్పూన్, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – రెండు టేబుల్ స్పూన్లు.
అరటి పువ్వు కందిపప్పు కూర తయారు చేసే విధానం..
కందిపప్పుకు తగినన్ని నీళ్లను జత చేసి కుక్కర్‌లో ఉంచి ఉడికించాలి. మరీ ముద్దగా చేయకూడదు. అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా చేసి పసుపు నీళ్లలో రెండు మూడు సార్లు కడిగి.. గట్టిగా పిండి నీరు తీసేయాలి. ఉడికిన పప్పులో వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు, పసుపు జత చేసి కలపాలి. మిరపకారం జత చేసి మరోమారు కలిపి తడిపోయే వరకు ఉడికించాలి. స్టవ్ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. జీలకర్ర, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ఎండు మిర్చి జత చేసి కలిపి.. ఉడికించిన కంది పప్పు అరటి పువ్వు కూరలో వేసి కలిపి.. వేడి వేడి అన్నంతో వడ్డించాలి. దీంతో అరటి పువ్వు కూర చాలా రుచిగా ఉంటుంది.
అరటి పువ్వును తినడం వల్ల మనకు ఎన్నో్ ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మలబద్దకం, గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. షుగర్, కొలెస్ట్రాల్, బీపీ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా దీన్ని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.