Cashew Nuts Laddu : ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, ఎముకలను దృఢంగా ఉండేలా చేయడంలో డ్రై ఫ్రూట్స్ ఉపయోగపడతాయి. బీపీ, షుగర్ వ్యాధిలను నియంత్రించడంలో ఇవి దోహదపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినలేము. కనుక వీటితో లడ్డూలను చేసుకుని ప్రతి రోజూ ఒకటి తినడం వల్ల మన శరీరానికి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ తో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – అర కప్పు, జీడి పప్పు – ఒక కప్పు, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, కర్బూజ గింజలు – పావు కప్పు, గుమ్మడి గింజలు – పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు.
డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిగా అయిన తరువాత బాదం పప్పును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత ఇందులోనే జీడిపప్పు కూడా వేసి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఎండు ద్రాక్షను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కర్బూజ గింజలు, గుమ్మడి గింజలు వేసి వేయించి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో కొబ్బరి పొడిని వేసి ఒక నిమిషం పాటు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదంపప్పును వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టి కొబ్బరి పొడిలో వేసి కలుపుకోవాలి. కర్బూజ గింజలను, గుమ్మడి గింజలను కూడా అదే విధంగా మిక్సీ పట్టి కొబ్బరి పొడిలో వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. తరువాత ఒక కళాయిలో బెల్లం తురుము, నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిని మరలా కళాయిలో పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ లడ్డూ తయారీకి ఎటువంటి పాకం రావల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తరువాత చిన్న మంటపై ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేసి కలిపి లడ్డూలలా చేయడానికి వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత కావల్సిన పరిమాణంలో లడ్డూలలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూలు 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటి తయారీలో ఇతర డ్రైఫ్రూట్స్ తోపాటు పంచదారను లేదా ఖర్జూర పండ్లను కూడా ఉపయోగించవచ్చు. ప్రతి రోజూ భోజనం తరువాత ఇలా తయారు చేసుకున్న లడ్డూను ఒకటి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు ఈ లడ్డునూ ఇవ్వడం వల్ల చురుకుగా ఉండడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు చర్మం నిగారించేలా చేయడంలో కూడా డ్రై ప్రూట్స్ సహాయపడతాయి. రోజుకి ఒకటి చొప్పున ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.