Sweet Corn Samosa : మనలో చాలా మంది సమోసాలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తినని వారు ఉండరు అంటే.. అది అతిశయోక్తి కాదు. మనకు బయట వివిధ రకాల రుచులలో సమోసాలు లభిస్తూ ఉంటాయి. ఇలా లభించే వాటిల్లో స్వీట్ కార్న్ సమోసా ఒకటి. స్వీట్ కార్న్ సమోసా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇంట్లో కూడా స్వీట్ కార్న్ సమోసాను చాలా రుచిగా, సులువుగా, కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోవచ్చు. ఇక కరకరలాడే స్వీట్ కార్న్ సమోసాను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరానలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 2 కప్పులు, స్వీట్ కార్న్ గింజలు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, పసుపు – కొద్దిగా, కారం – రుచికి సరిపడా, గరం మసాలా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, నీళ్లు – తగినన్ని.
స్వీట్ కార్న్ సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లను పోసి మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పిండిని మరోసారి కలిపి ముద్దలుగా చేసి పొడి పిండి సహాయంతో వీలైనంత పలుచగా చపాతీలా చేసుకోవాలి. ఇలా పలుచగా చేయడం వల్ల సమోసాలు కరకరలాడుతాయి. ఇలా చేసుకున్న వాటిని పెనంపై ఉంచి చిన్న మంటపై ఒకే నిమిషంలో రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత వీటిని మరీ చిన్నగా కాకుండా దీర్ఘ చతురస్రాకారంలో పట్టీలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, స్వీట్ కార్న్ గింజలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా పిండి, నీళ్లు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పట్టీలుగా చేసుకున్న వాటిని తీసుకుని సమోసా ఆకారంలో చుట్టి.. కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఉంచి అంచులకు పేస్ట్ లా చేసుకున్న మైదా పిండిని రాసి మూసి వేయాలి. ఇలా సమోసాలన్నింటినీ చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి కాగాక మధ్యస్థ మంటపై సమోసాలను నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ సమోసాలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా పల్లి చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.