Curd Rice : వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే పెరుగన్నం.. ఇలా త‌యారు చేస్తే ఆరోగ్య‌క‌రం..!

Curd Rice : వేస‌వి కాలంలో ఎండల‌ తీవ్ర‌త‌ను త‌ట్టుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. శ‌రీరంలో ఉండే వేడి తగ్గి శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌డానికి పెరుగును, పెరుగుతో చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌లో చాలా మంది పెరుగుతో ఎక్కువ‌గా మ‌జ్జిగ, ల‌స్సీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వీటిని తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అయితే పెరుగుతో పెరుగ‌న్నం త‌యారు చేసుకుని తింటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇది శ‌రీరంలోని వేడిని మొత్తం త‌గ్గించేస్తుంది. దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌గానే కాక‌.. మ‌ధ్యాహ్నం లంచ్‌గా కూడా తీసుకోవ‌చ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఎండ దెబ్బ బారిన ప‌డకుండా ఉంటారు. వేస‌వి తాపం త‌గ్గుతుంది. ఇక పెరుగన్నం ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Curd Rice  very easy and healthy recipe
Curd Rice

పెరుగ‌న్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 2 క‌ప్పులు, పెరుగు – 3 క‌ప్పులు, త‌రిగిన ప‌చ్చి మిర్చి ముక్క‌లు – 2 టీ స్పూన్స్‌, త‌రిగిన ఉల్లి పాయ ముక్క‌లు- పావు కప్పు, ఉప్పు – రుచికి త‌గినంత , త‌రిగిన అల్లం ముక్క‌లు – 1 టీ స్పూన్‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌ , నీళ్లు – 1 గ్లాసు.

తాళింపుకు కావ‌ల‌సిన పదార్థాలు..

నూనె- 2 టీ స్పూన్స్‌, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల క‌ర్ర – ఒక టీ స్పూన్‌, ఎండు మిర్చి – 2 , క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఇంగువ – అర టీ స్పూన్‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

పెరుగ‌న్నం త‌యారీ విధానం..

మొద‌ట‌గా కొద్దిగా మెత్త‌గా ఉడికించిన అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. పెరుగ‌న్నం కోసం తాజాగా వండిన అన్నాన్ని లేదా తిన‌గా మిగిలిన అన్నాన్ని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ అన్నంలో పెరుగు, రుచికి తగినంత ఉప్పు, స‌రిప‌డా నీళ్లు పోసి బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న అన్నంలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చి మిర్చి ముక్క‌లు, అల్లం ముక్కలు, మిరియాల పొడి వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక తాళింపు ప‌దార్థాలు అన్నీ వేసి వేయించుకోవాలి. ఈ తాళింపును ముందుగా చేసి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేసి క‌లుపుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పెరుగ‌న్నం త‌యార‌వుతుంది. వేస‌వి కాలంలో పెరుగుతో ఇలా చేసుకోవ‌డం వ‌ల్ల రుచితోపాటుగా శ‌రీరంలో ఉండే వేడి త‌గ్గి చ‌లువ చేస్తుంది.

D

Recent Posts