Nimmakaya Pulihora : అన్నంతో చేసే వెరైటీలలో నిమ్మకాయ పులిహోర ఒకటి. మనలో చాలా మంది దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ పులిహోరను రాత్రి మిగిలిన అన్నంతో లేదా తాజాగా వండిన అన్నంతో తయారు చేస్తూ ఉంటారు. మనలో కొందరు నిమ్మ కాయ పులిహోరను భగవంతునికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు. దీనిని తయారు చేసుకునే విధానం కూడా చాలా మందికి తెలుసు. కానీ కొందరికి ఎన్ని సార్లు ప్రయత్నించినా రుచిగా తయారు చేసుకోవడం రాదు. నిమ్మకాయ పులిహోరను కింద తెలిపిన విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలను, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
నిమ్మకాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – అర కిలో బియ్యంతో ఉడికించినంత, నిమ్మ రసం – మీడియం సైజులో 4 లేదా5 నిమ్మ కాయల నుండి తీసినది, ఉప్పు – రుచికి తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, పల్లీలు – 3 టీ స్పూన్స్, శనగ పప్పు – 2 టీ స్పూన్స్, మినప పప్పు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పచ్చి మిర్చి ముక్కలు – రుచికి సరిపడా, ఎండు మిర్చి – 4, కరివేపాకు – 2 రెబ్బలు, పసుపు – ఒక టీ స్పూన్ , తరిగిన కొత్తి మీర – కొద్దిగా.
నిమ్మకాయ పులిహోర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అన్నాన్ని తీసుకుని పొడిగా, చల్లగా ఉండేలా చేసుకోవాలి. తరువాత నిమ్మ రసంలో రుచికి సరిపడా ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు కలుపుకోవాలి. ఈ నిమ్మ రసాన్ని అన్నంలో వేసి అన్నం మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక పల్లీలు, శనగ పప్పు, మినప పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక పసుపు, కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. చివరగా పసుపు, కొత్తి మీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా నిమ్మరసం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకోవడం వల్ల నిమ్మకాయ పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. రాత్రి మిగిలిన అన్నంతో నిమ్మకాయ పులిహోరను చేయడం వల్ల శరీరానికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి.