Jowar Upma : జొన్న‌ల‌తో ఉప్మా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.. ఇలా చేసుకోండి..!

Jowar Upma : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు ఒక‌టి. జొన్న‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండ‌డంతోపాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగుప‌డుతుంది. ఎముక‌లను దృఢంగా చేయ‌డంలో జొన్న‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుప‌డి అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

Jowar Upma  very healthy easy to make
Jowar Upma

మ‌నం ఎక్కువ‌గా జొన్న పిండితో చేసే రొట్టెల‌ను తింటూ ఉంటాం. జొన్న‌ల‌తో రొట్టెలే కాకుండా ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జొన్న ర‌వ్వ ఉప్మా చాలా రుచిగా ఉండ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ జొన్న ర‌వ్వ ఉప్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న ర‌వ్వ ఉప్మా త‌యారీ విధానం..

జొన్న ర‌వ్వ – ఒక క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, త‌రిగిన‌ ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, త‌రిగిన అల్లం ముక్క‌లు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు -ఒక రెబ్బ‌, చిన్న‌గా త‌రిగిన బంగాళా దుంప – 1, త‌రిగిన క్యారెట్ – ఒక‌టి, త‌రిగిన ట‌మాటా – 1, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నీళ్లు – మూడున్న‌ర క‌ప్పులు.

జొన్న ర‌వ్వ ఉప్మా త‌యారీ విధానం..

ముందుగా జొన్న రవ్వ‌ను క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి ఒక రాత్రి అంతా లేదా 7 నుండి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక శ‌న‌గ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి, అల్లం ముక్కలు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక త‌రిగిన బంగాళాదుంప‌, క్యారెట్, ట‌మాటా ముక్క‌లు వేసి క‌లిపి వేయించుకోవాలి. ఇవి వేగాక ఉప్పు, నీళ్లు వేసి క‌లిపి నీళ్లను మ‌రిగించుకోవాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న జొన్న ర‌వ్వ‌ను వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.

జొన్న ర‌వ్వ పూర్తిగా ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న ర‌వ్వ ఉప్మా త‌యార‌వుతుంది. మామూలు ఉప్మా కంటే ఈ ఉప్మా కొద్దిగా జిగురుగా ఉంటుంది. జొన్న ర‌వ్వతో ఇలా ఉప్మాను త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌మ‌వుతుంది.

జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, బీపీని, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో జొన్న‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌ను ప్ర‌తి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు చేర‌డం త‌గ్గి శ‌రీరం గ‌ట్టి ప‌డుతుంది. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో కూడా జొన్న‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు రాకుండా చేయ‌డంలోనూ జొన్న‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Share
D

Recent Posts