Panasapottu Kura : మనకు సహజ సిద్దంగా తియ్యగా ఉంటూ అందుబాటులో ఉండే వాటిల్లో పనసకాయ ఒకటి. పనస తొనలను తినడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది. వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పనస తొనలతోనే కాకుండా పనస పొట్టును కూడా తినవచ్చు. అయితే దీన్ని నేరుగా తినలేరు. దీన్ని కూర రూపంలో వండి తింటుంటారు. ఈ క్రమంలోనే పనస పొట్టు కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. దీన్ని తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస పొట్టు ఆవ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పనస పొట్టు – రెండు కప్పులు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – రెండు టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చి మిర్చి – 6, ముక్కలుగా చేసిన ఎండు మిర్చి – 8, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – అర టీ స్పూన్, చింతపండు రసం – తగినంత.
పనప పొట్టు ఆవ కూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పనస పొట్టు వేసి కడిగి తగినన్ని నీళ్లు, పసుపు, తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి, నీరు అంతా పోయేలా ఒక జల్లి గిన్నెలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో నాలుగు ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగాక శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
తరువాత ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత చింతపండు రసాన్ని వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పనస పొట్టును వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కూర పూర్తిగా చల్లారిన తరువాత ముందుగా మెత్తగా చేసుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనస పొట్టు ఆవ కూర తయారవుతుంది. ఈ కూర రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ కూరను అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.