Coconut Chutney : మనం సాధారణంగా ఇడ్లీ, దోశ వంటి వాటిల్లోకి కొబ్బరి చట్నీని తయారు చేసుకుంటాం. కానీ మనలో చాలా మందికి ఎన్ని సార్లు ప్రయత్నించినా హోటల్స్ లో దొరికే కొబ్బరి చట్నీలా తయారు చేసుకోవడం రాదు. హోటల్స్ లో దొరికే కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా ఈ చట్నీని అంతే రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి, కొబ్బరి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, పుట్నాల పప్పు – పావు కప్పు, పచ్చి మిరపకాయలు – 10, పల్లీలు – పావు కప్పు, నూనె- ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, జీల కర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్ , ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
కొబ్బరి చట్నీ తయారు చేసే విధానం..
ముందుగా పల్లీలను బాగా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి మిరప కాయలతోపాటుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను, పుట్నాల పప్పు, ఉప్పును వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చట్నీలా చేసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును ముందుగా తయారు చేసుకున్న చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ తయారవుతుంది. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, వడ, బొండా వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.