Tomato Soup : టమాటా సూప్.. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి టమాటా సూప్ ను తాగితే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. టమాటా సూప్ చాలా రుచిగా ఉంటుంది. బయట రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే టమాటా సూప్ ను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో టమాటా సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 4, బటర్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, వెల్లుల్లి రెబ్బలు – 4, మిరియాలు – పావు టీ స్పూన్, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – రెండున్నర కప్పులు, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, పంచదార – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెనిగర్ – ఒక టీస్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, టమాట సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ వేడయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దాల్చిన చెక్కను, బిర్యానీ ఆకును తొలగించి మిగిలిన పదార్థాలను పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత అర కప్పు నీళ్లను పోసి మరలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని జల్లిగంటె సహాయంతో వడకట్టుకుని ఒక కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఈ టమాట మిశ్రమంలో నీళ్లను పోసి పొంగు వచ్చే వరకు మరిగించాలి. దీనిని మరికొద్ది సేపు మరిగించి కొత్తిమీర, కార్న్ ఫ్లోర్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని మరుగుతున్న టమాట సూప్ లో కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
టమాట సూప్ చల్లగా అయ్యే కొద్దీ చిక్కగా తయారవుతుంది. కనుక కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అచ్చం బయట లభించే విధంగా ఉండే టమాట సూప్ తయారవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా టమాట సూప్ ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.