Palli Chutney : మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి రకరకరాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఒక్కో ఆహార పదార్థానికి ఒక్కోరకం చట్నీని తయారు చేస్తూ ఉంటాం. కానీ వీటన్నింటిని ఒకే చట్నీతో కలిపి తినవచ్చు. ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ముప్పావు కప్పు, ఎండు మిరపకాయలు – 6 లేదా 7, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి (చిన్నది), వెల్లుల్లి రెబ్బలు – 2, చింతపండు – కొద్దిగా, నూనె – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – 2.
పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగాక ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగాక చింతపండును వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో వేయించి పెట్టుకున్న వాటితోపాటు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపుతోపాటు తరిగిన ఉల్లిపాయలను ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి చట్నీ తయారవుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ పల్లి చట్నీని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.