Nuvvula Laddu : నువ్వుల ల‌డ్డూలు ఎంతో బ‌లం.. రోజుకు ఒక‌టి తినాలి.. త‌యారీ ఇలా..!

Nuvvula Laddu : నువ్వులు.. వీటిని ఎంతో కాలం నుండి మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. నువ్వుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. నువ్వుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వంట‌ల్లోనే కాకుండా నువ్వుల‌తో తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో నువ్వుల ల‌డ్డూలు కూడా ఒక‌టి. స్వీట్ షాపుల్లో దొరికే విధంగా ఉండే నువ్వుల ల‌డ్డూల‌ను మ‌నం చాలా సులువుగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రుచిగా నువ్వుల ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల ల‌డ్డూల‌ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

నువ్వులు – ఒక క‌ప్పు, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – చిటికెడు.

Nuvvula Laddu make in this way eat daily one
Nuvvula Laddu

నువ్వుల ల‌డ్డూల‌ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నువ్వుల‌ను వేసి చిన్న మంట‌పై దోర‌గా 5 నుండి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత ఈ నువ్వుల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్ల‌ను పోసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒకసారి వ‌డక‌ట్టుకుని మ‌ర‌లా అదే క‌ళాయిలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మిశ్ర‌మాన్ని మ‌ధ్య‌స్థ మంట‌పై ముదురు పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. నీటిలో వేసి చూసిన‌ప్పుడు బెల్లం మిశ్ర‌మం గ‌ట్టిగా చెక్క‌లాగా మారిన‌ప్పుడు పాకం సిద్ధ‌మైందిగా భావించి యాల‌కుల పొడి వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

బెల్లం మిశ్ర‌మం గ‌ట్టిప‌డ‌క‌పోతే మ‌రి కొద్ది సేపు ఉడికించి పాకం వ‌చ్చిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వెంట‌నే వేయించిన నువ్వుల‌ను వేసి నువ్వులు, బెల్లం మిశ్ర‌మం బాగా క‌లిసేలా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ త‌గినంత మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూల‌లాగా చుట్టుకోవాలి లేదా ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి పై భాగం స‌మానంగా వ‌చ్చేలా చేసుకుని క‌త్తితో కావ‌ల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి.

ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ నుండి వేరు ముక్క‌లుగా చేసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల నువ్వుల‌తో ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌తోపాటు చిక్కీల‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న నువ్వుల ల‌డ్డూల‌ను గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా చేసిన నువ్వుల ల‌డ్డూల‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నువ్వుల ల‌డ్డూల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

Share
D

Recent Posts