Ragi Sangati Mudda : రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒకటిగా ఉన్నాయి. రాగులను ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా జావ రూపంలో తీసుకుంటుంటారు. అయితే వీటిని సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లో అయినా సరే తినవచ్చు. రాగులను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం కూడా బాగా తయారవుతుంది. అయితే రాగి జావను తాగలేని వారు రాగి సంగటి ముద్దను తయారు చేసుకుని తినవచ్చు. ఇందులో ఏ కూరను కలిపి తిన్నా సరే రుచిగానే ఉంటుంది. ఇక రాగి సంగటి ముద్దను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి సంగటి ముద్ద తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒకటిన్నర కప్పు, బియ్యం – అర కప్పు, ఉప్పు – తగినంత.
రాగి సంగటి ముద్దను తయారు చేసే విధానం..
ముందుగా నీటిలో బియ్యాన్ని పోసి ఉడికించుకోవాలి. రాగి పిండిని ఉండలు లేకుండా కొద్దిగా నీటిలో కలుపుకుని పెట్టుకోవాలి. 3/4 వంతులు ఉడికిన బియ్యంలో పిండిని పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఉప్పు సరిపడా వేసుకుని కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన తరువాత ముద్దలుగా చేసుకోవాలి. దీంతో రాగి సంగటి ముద్దలు తయారవుతాయి. వీటిని ఏ కూరతో తిన్నా సరే రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. అనేక పోషకాలను కూడా పొందవచ్చు.