Vamu Annam : మనం వంటల తయారీలో, చిరు తిళ్ల తయారీలో ఉపయోగించే వాటిల్లో వాము కూడా ఒకటి. వామును ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వాము వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాము ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో వాము ఎంతో ఉపయోగపడుతుంది.
మనకు వచ్చే పంటి నొప్పులను, చెవి నొప్పులను, అదేవిధంగా ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను నయం చేయడంలో కూడా వాము దోహదపడుతుంది. వామును కొద్దిగా వేయించి తరుచూ వాసన చూస్తూ ఉండడం వల్ల సాధారణ జలుబు తగ్గుతుంది. స్త్రీలలో నెలసరిని క్రమతప్పకుండా వచ్చేలా చేయడంలో కూడా వాము సహాయపడుతుంది. వామును వివిధ రకాల ఆహారపదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇవే కాకుండా వామును ఉపయోగించి వాము అన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఇలా వాము అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. వాము అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాము అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – రెండు కప్పులు, వాము – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
వాము అన్నం తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని చల్లగా చేసి ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వాము, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలిపి మూడు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాము అన్నం తయారవుతుంది. వాము ఘాటుగా ఉంటుంది. కనుక ఇందులో కారాన్ని వేసుకోకూడదు. ఒక వేళ వేసుకున్నా కూడా తక్కువగా వేసుకోవాలి. అజీర్తి, పొట్టలో గ్యాస్ వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఇలా వాము అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల అజీర్తి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇలా అప్పుడప్పుడూ వాము అన్నాన్ని తయారు చేసి పెట్టడం వల్ల అజీర్తి వల్ల కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది. దీంతో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.