Poori : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా గోదుమ పిండిని ఉపయోగించి అప్పుడప్పుడూ పూరీలను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది చపాతీల కంటే పూరీలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువే. అయితే కొంతమందికి ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా పూరీలు మెత్తగా రావు. అస్సలు పొంగవు. గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పూరీలు పొంగడమే కాకుండా మెత్తగా కూడా ఉంటాయి. మెత్తగా ఉండేలా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాఫ్ట్ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – రెండు కప్పులు, బొంబాయి రవ్వ – పావు కప్పు, పాలు – అర కప్పు, ఉప్పు – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, నీళ్లు – తగినన్ని.
సాప్ట్ పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని, బొంబాయి రవ్వను, ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పాలను పోసి కలిపిన తరువాత తగినన్ని నీళ్లను పోసి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. 10 నిమిషాల తరువాత పిండిని మరోసారి బాగా కలుపుకుని కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకుని పొడి పిండిని వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా పూరీలను వత్తుకోవాలి. ఇలా అన్ని పూరీలను చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక మంటను మధ్యస్థంగా చేసి ఒక్కో పూరీను వేసుకుంటూ గరిటెతో పూరీని నూనె లోపలికి వెళ్లేలా వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు పూరీని మరో వైపునకు తిరగేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి లేదా హాట్ బాక్స్ లోకి తీసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు మెత్తగా ఉంటాయి. పూరీ పిండిని కలిపేటప్పుడు లేదా పూరీలను వత్తేటప్పుడు నూనెను వాడరాదు. నూనెను ఉపయోగించడం వల్ల పూరీలను కాల్చేటప్పుడు అవి ఎక్కువగా నూనెను పీల్చుకుంటాయి. అలాగే పూరీలను ఎక్కువ సేపు నూనెలో ఉంచడం వల్ల అవి గట్టిగా తయారవుతాయి. కనుక నిర్దిష్టమైన సమయం పాటు మాత్రమే పూరీలను నూనెలో ఉంచాలి. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల పూరీలు పొంగడమే కాకుండా మెత్తగా కూడా ఉంటాయి.